CM Revanth Revives Indiramma Housing Scheme: సొంతిల్లు… ప్రతి పేదవాడి జీవితకాలపు కల. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఆ కల సాకారమైతే వారి కళ్లల్లో కనిపించే ఆనందం వెలకట్టలేనిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహప్రవేశాల పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేల్చారు. పదేళ్ల పాలనలో పేదలకు గూడు కల్పించడంలో గత ప్రభుత్వం ఎందుకు విఫలమైంది..? “చచ్చిన పామును మళ్లీ చంపాలా..?” అంటూ ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు..? పేదల సంక్షేమంపై ఆయన ఇచ్చిన భరోసా ఏంటి..?
బెండాలపాడులో సంక్షేమ పండుగ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంతో సోమవారం సందడిగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై, లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం, గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు పట్టువస్త్రాలు అందించి వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/mother-and-lover-arrested-in-bhupalpally-double-murder-case/
హనుమాన్ గుడి లేని ఊరున్నా… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిందని గుర్తుచేశారు. “రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు,” అంటూ ఆ పథకం ప్రాధాన్యతను చాటిచెప్పారు. గృహ నిర్మాణ శాఖను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతమైందని ప్రశంసించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఘాటు విమర్శలు: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు సొంతింటి కల నెరవేరలేదని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “రెండు పడక గదుల ఇళ్లు అంటూ ప్రజలను మభ్యపెట్టి, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. వారు నిజంగా ఏటా 2 లక్షల ఇళ్లు కట్టినా, పదేళ్లలో 20 లక్షల మంది పేదలకు గూడు దక్కేది,” అని ఆయన ఆక్షేపించారు. పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాది రేషన్ కార్డులతో పాటు, తాము తినే సన్న బియ్యాన్నే పేదలకు అందిస్తున్నామని తెలిపారు.
“మీ కుటుంబ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు”: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “గత ప్రభుత్వంలో రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు ఆ అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతో వారి కుటుంబాల్లోనే చిచ్చు రేగింది. అక్క, అన్న, చెల్లి, బావ ఒకరినొకరు పొడుచుకుంటున్నారు,” అని ఎద్దేవా చేశారు. “మీరు మీరు కొట్లాడుకుని మా మీదకు వస్తారెందుకు..? మాకు రేషన్ కార్డులు, ఇళ్లు ఇచ్చే పనుంది. మీ కుటుంబ వివాదాల్లోకి మమ్మల్ని లాగకండి. బీఆర్ఎస్ అనే కాలనాగును ప్రజలే బండరాయితో కొట్టి చంపారు. చచ్చిన పామును మళ్లీ నేను చంపాలా..? మీ పంచాయితీని పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోండి,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


