ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రేవంత్‌రెడ్డి మరో 15- 20ఏళ్లు సీఎంగా ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. వనపర్తిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనకు విద్యాబుద్ధులు నేర్పిన వనపర్తికి, తెలంగాణకు కీర్తి తెచ్చేలా పని చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళలకు ప్రాముఖత్య ఇచ్చే ప్రభుత్వం అని తెలిపారు. రూ. 1000 కోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు తెలంగాణ మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చామన్నారు. అలాగే ఆడబిడ్డలే స్వయంగా 1000 బస్సులు ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి ఆదాయం పొందేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలలు నిర్వహణ బాధ్యత మహిళలకే ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు.
4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ళు ఆడబిడ్డల పేరుతో ఇచ్చామన్నారు. కేసీఆర్(KCR) కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఏ ఒక్క నిరుద్యోగికి మాత్రం ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇందిరమ్మ రాజ్యానిదన్నారు. తాము ఒక్క ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇస్తే, ప్రధాని మోడీ(PM Modi) ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరో 15 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే తమ బతుకు బస్టాండ్ అవుతుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని సీఎం వెల్లడించారు.