సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ “అభయ హస్తం” పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా 20 మంది అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహక చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు అందించినట్టు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలు చేపట్టామన్నారు. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా త్వరలోనూ పూర్తి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే ప్రయత్నం చేస్తోందని వివరించారు. మార్చి 31లోగా 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుచేశారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన బిహార్ నుంచి అనేకమంది సివిల్స్‌కు ఎంపిక అవుతుంటే.. తెలంగాణలో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. అందుకే సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు.