Revanth Reddy: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రస్తావించారు. కామారెడ్డి జిల్లాలో వరదనష్టంపై కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధశాఖల మధ్య సమన్వయం కనిపించడం లేదన్నారు. ఏ పనిలోనైనా సమన్వయం అవసరమన్నారు. ప్రభుత్వ శాఖ మధ్య సమన్వయం ఉంటేనే.. వరద నష్టాలను తగ్గించగలమని ఆయన అన్నారు. ఎవరికి వారు ఉంటామంటే క్రైసిస్ మేనేజ్ మెంట్ సాధ్యం కాదన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు అవసరమో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు, నిర్మాణాలు, తాత్కాలికం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.
Read Also: Nimmala: కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించి మంత్రి నిమ్మల
సమన్వయ లోపం వల్లే..
ఎరువుల పంపిణీలోనూ సమన్వయలోపం వల్లే సమస్యలు వస్తున్నాయని రేవంత్ అన్నారు. యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి గందరగోళం లేకుండా చూడాలన్నారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమస్యలపై 15 రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, వివిధశాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
Read Also: Railway: ఆదాయం విషయంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు
వరద ప్రాంతాల్లో పర్యటన
ఇటీవల కురిసి భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ వంతెనను పరిశీలించారు. వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్‌డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. పూర్తిస్థాయి అంచనాలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


