Thursday, July 4, 2024
HomeతెలంగాణRevanth in Badibata: త్వరలో సెమీ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్

Revanth in Badibata: త్వరలో సెమీ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్

సింగిల్ టీచర్ స్కూళ్లు మూసేయం

రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. కార్పొరేట్ పాఠశాలలతో మా విద్యార్థులు పోటీపడటం మా గౌరవాన్ని మరింత పెంచిందని రేవంత్ అన్నారు.

- Advertisement -

విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలన్న సీఎం రేవంత్ 90 శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనన్నారు. నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని, విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని ఆయన గతాన్ని గుర్తుచేసుకున్నారు.

మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితని, కానీ సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళుతుంది.

శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొటోఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని, గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా తల్లదండ్రులకు పిల్లల సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు సీఎం. విద్య మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని, విద్యపై పెట్టే పెట్టుబడి మన సమాజానికి లాభాన్ని చేకూరుస్తుందన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్ లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామన్నారు. మా ప్రభుత్వానికి భేషజాలు లేవని, ఎవరైనా సలహాలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్మీడియట్ లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి భవిష్యత్ లో రాణించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ, మీకు ప్రజా ప్రభుత్వం ఉంది.. ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా ముందుకెళతామన్నారు సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News