Revanth Reddy Sensational Comments on KTR Before Jublieehills Elections: తెలంగాణ రాజకీయం జూబ్లీహిల్స్ చుట్టూనే తిరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారపర్వం ఆఖరి అంకానికి చేరింది. ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల చివరి రోజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేసిన పునాదులతోనే.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయన్నారు. ఆదివారం హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన ఆయన గత రెండేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. నాడు వైఎస్ఆర్ ఉచిత కరెంట్ ఇస్తే.. మన్మోహన్ 70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారంటూ పేర్కొన్నారు. తాము చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కావని.. రెండేళ్ల తమ పాలనను పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చకండి అంటూ మీడియాకు సూచించారు. తెలంగాణలో జలయజ్ఞంతో అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ కట్టిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదని, హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయన్నారు. మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే.. 8 లక్షల కోట్ల అప్పులు చేసి తనకు కేసీఆర్ ఇచ్చి వెళ్లారని విమర్శించారు.
మాది అగ్రికల్చర్.. వారిది డ్రగ్స్ కల్చర్..
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ ధీమా వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌లో 100 శాతం కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీజేపీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఫలితం మాత్రం ఇదేనంటూ నొక్కి చెప్పారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యంపై వచ్చిన ఆదాయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిందా అని తెలంగాణ సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్.. అనేది ప్రజలే గమనించాలన్నారు. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో .. సినీ తారలతో ఎవరు గెస్ట్ హౌసుల్లో చర్చలు చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. సెంటిమెంట్ కావాలో డెవలప్‌మెంట్ కావాలో తేల్చుకోండి.. అంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు సూచించారు. దేశంలో అతిపెద్ద విచారణ సంస్థగా పేరొందిన సీబీఐకి కాళేశ్వరం కేసును అప్పగించామన్నారు. తనను బెదిరించడానికి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మూకుమ్మడిగా బంద్ చేశాయి. ఆరు నెలలు బంద్ చేశారనుకో పిల్లల అకడమిక్ ఇయర్ ఏం కావాలి.. విద్య వ్యాపారం కాదు సేవ.. పంతాలు, పట్టింపులకు పోతే పరిష్కారం దొరకదంటూ హితవు పలికారు. కాగా, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఎల్లుండి (నవంబర్ 11)న పోలింగ్ జరగనుంది.. ఇక, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.


