తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

ప్రజా పాలనలో ఉజ్వల పునర్ నిర్మాణం దిశగా తెలంగాణ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. అన్నీ రంగాల్లో అద్భుత ప్రగతికి గొప్ప బాటలు వేసుకుంటోందని తెలిపారు. ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ గత పాలకుల పాపాలను పరిష్కరిస్తూ ఆకాశమే హద్దుగా వృద్ధిని సాధించే విశ్వాసాన్ని ప్రదర్శిస్తోందని తెలిపారు. ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగం సకల జన సంక్షేమాన్ని, సమస్త రంగాల అభివృద్ధిని, నిజాయితీగా, నిష్పాక్షికంగా ప్రజా కోణంలో వెల్లడించిందని రేవంత్ వెల్లడించారు. కాగా గవర్నర్ ప్రసంగాన్ని అధికార పార్టీ సభ్యులు స్వాగిస్తుండగా.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

