Saturday, October 5, 2024
HomeతెలంగాణCongress: రేవంత్ మరోపోరు.. పాపం ఈసారైనా కలిసి వచ్చేనా?

Congress: రేవంత్ మరోపోరు.. పాపం ఈసారైనా కలిసి వచ్చేనా?

- Advertisement -

Congress: తెలంగాణ రాజకీయాలు పైకి వాడీ వేడిగా కనిపించినా లోతుగా చూస్తే అంత సీన్ కనిపించడం లేదు. బీజేపీ పుంజుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నా అధికారం దక్కించుకునే స్థాయిలో వచ్చే పరిస్థితి లేదన్నది క్లియర్. ఇక, కాంగ్రెస్ పార్టీ విధానాలేంటో.. అది తిరిగి పునర్వైభవం సాధించుకునేందుకు ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలేంటో ప్రజలకు కూడా స్పష్టత ఉండడం లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సూపర్ స్ట్రాంగ్ గా మారిపోతున్నారు.

నిజానికి రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో పుంజుకోవడానికి మంచి అవకాశాలే ఉన్నాయి. కానీ.. కాంగ్రెస్ మాత్రం ఆచరణలో ఫెయిల్ అవుతుంది. దానికి కారణం కూడా ఆ పార్టీ నేతలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు. ఆ గొడవలే తెలంగాణలో ప్రజలకు పార్టీని దూరం చేస్తుంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ క్యాడర్ లో కాస్త జోష్ కనిపించినా నేతలు మాత్రం యధావిధంగా అదే తంతు కొనసాగిస్తున్నారు. దానికి ఉదాహరణే తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలలో ఘోర ఓటమి.

ఇప్పటికే పలుమార్లు యాత్రలు, పోరులు తలపెట్టిన అధ్యక్షుడు రేవంత్ కొంతవరకు ప్రజలలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. ఆ పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో వాటి ప్రభావం అధికార పార్టీపై పెద్దగా కనిపించలేదు. అయినా రేవంత్ ఇప్పుడు మరో పోరుకు సిద్ధమయ్యారు. ఈసారి రైతు సమస్యలపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ధరణి పోర్టల్, ధాన్యం కొనుగోలు, పోడు భూముల సమస్యలపైన కార్యాచరణ సిద్ధం చేస్తూ పార్టీ నేతలు కలిసి రావాలని కోరారు.

ముందుగా ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తర్వాత గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కార్యాచరణ బాగానే ఉంది కానీ.. ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందన్నది ప్రశ్న. ఈ కార్యక్రమంపై చర్చ కోసం రేవంత్ పార్టీలో సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపిస్తేనే.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు హాజరవగా జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సమన్వయ లోపమే కాంగ్రెస్ పార్టీకి కొరకురాని కొయ్య కాగా.. రేవంత్ సిద్దమైన ఈ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News