Revanth Reddy: ఎడతెరిపిన లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి చేరుకున్నారు. తొలుత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. స్థానికంగా వరదలకు ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించారు. పంటనష్టం, ఆస్తినష్టం తదితర వివరాలను బాధితులు, స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ పర్యటించారు. అక్కణ్నుంచి ప్రత్యేక బస్సు ప్రజా సంక్షేమ రథంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లారు.
రేవంత్ రెడ్డి లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్&బి బ్రిడ్జ్ ను పరిశీలించారు. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్, బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. పూర్తిస్థాయి అంచనాలతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పారు.
వర్షాల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇళ్లల్లోని నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరడం సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు వరదలతో రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్లా వాహనాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. కాగా మండలంలోని బురుగిద్ద గ్రామంలో నష్టపోయిన పలువురు రైతుల పొలాలను పరిశీలించి వారితో మాట్లాడనున్నారు సీఎం. అనంతరం కామారెడ్డి పట్టణంలో వరద బీభత్సానికి నీటమునిగిన జీఆర్ కాలనీ తదితర ప్రాంతాలను పరిశీలించనున్నారు.
కాగా, కామారెడ్డి జిల్లాలో 36.8 సెం.మీల వర్షపాతం నమోదు అయిన విషయం తెలిసిందే. జిల్లా చరిత్రలోనే ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. ఈ భారీ వానలకు పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వంతెనలు కూలడంతోపాటు కల్వర్టులు కొట్టుకుపోయాయి. వాగులు పొంగి..ఊళ్లకు ఊళ్లే జలదిగ్భందమయ్యాయి. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంటనష్టపోయిన రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇటీవలి కాలంలో తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సెప్టెంబర్ నెలంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.


