BJP: తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనల్లోనే నేతలు బాహాబాహీకి దిగడం.. కమిటీ నియామకాలపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం అప్రమత్తమైంది. గుట్టుచప్పుడు కాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణలు కోరడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా పర్యటనలు చేపడుతూ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, కొత్త కమిటీలకు ప్రోత్సాహం ఇవ్వాలని భావించారు. అయితే, ఇందుకు భిన్నంగా పలు జిల్లాల్లో వర్గపోరు బహిర్గతమవుతున్నది. అధ్యక్షుడి సమక్షంలోనే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ బాహాబాహీకి దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చినికిచినికి గాలివానగా మారే ప్రమాదం ఉందని పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అధిష్టానం ‘సీక్రెట్’ఆపరేషన్
రాంచందర్‌రావు పర్యటనల్లో బయటపడుతున్న వర్గపోరును కట్టడి చేసేందుకు పార్టీ నాయకత్వం నడుం బిగించినట్లు తెలుస్తోంది. వర్గపోరుకు కారణమవుతున్న నేతలకు మూడో కంటికి తెలియకుండా షోకాజ్ నోటీసులు పంపించింది. సంజాయిషీ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న జిల్లా నేతలు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి క్యూ కట్టారు. నాయకత్వం వారి నుంచి రాతపూర్వకంగా వివరణలు తీసుకుంది. అయితే, ఈ ప్రక్రియ మొత్తం గుట్టుచప్పుడు కాకుండా చేపడుతూ ఉండటం గమనార్హం. వివరణ ఇచ్చేందుకు పలువురు నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర కార్యాలయానికి క్యూ కట్టడంతోనే ఈ విషయం బహిర్గతమైంది. నోటీసులు అందుకున్న పెద్దపల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి రాంచందర్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన దాదాపు ఏడుగురికి ఈ నోటీసులు అందినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పాలమూరు జిల్లా నాయకుడు, పార్టీ రాష్ట్ర కోషాధికారి శాంతి కుమార్ సైతం ఇప్పటికే తన వివరణను రాష్ట్ర నాయకత్వానికి రాతపూర్వకంగా అందించినట్లు తెలిసింది.
ఎక్కడ చూసినా వర్గపోరే!
పెద్దపల్లి, మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్.. ఇలా ఏ జిల్లాల్లో చూసినా వర్గపోరు బయటపడుతోంది. రాంచందర్‌రావు ఇటీవల పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు.. దుగ్యాల ప్రదీప్ రావు, గుజ్జుల రామకృష్ణ రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. అలాగే, మహబూబ్‌నగర్ పర్యటనలోనూ రాంచందర్‌రావుకు ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఎంపీ డీకే అరుణకు వ్యతిరేకంగా సొంత పార్టీ వారే నినాదాలు చేశారు. దానికి తోడు, కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య వర్గపోరు, రంగారెడ్డి జిల్లా నేతలపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసహనం, నిజామాబాద్‌లో కమిటీల ఇష్యూపై ఎంపీ ధర్మపురి అర్వింద్ అసహనం వ్యక్తం చేయడంతో సదరు వివాదాలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే పలు జిల్లాల పంచాయతీలు రాష్ట్ర కార్యాలయానికి చేరడంతో గుట్టుచప్పుడు కాకుండా నోటీసులు అందించిన అంశం బయటకు పొక్కింది. ఇంత సైలెంట్‌గా షోకాజ్ నోటీసులు ఇచ్చి వారి వివరణ కోరడంతో పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, త్వరలో మరికొంతమందికి సైతం నోటీసులు అందించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతుంది.


