తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం అంతా షాక్ తిన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఉర్రూతలూపి, ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన కళాకారుల్లో సాయిచంద్ ఒకరు.
సాయిచంద్ ఆకస్మిక మృతిపై స్పందించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. సాయిచంద్ అంతిమయాత్రకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. సాయిచంద్ భౌతిక కాయం వద్ద నివాళి అర్పించేందుకు వచ్చిన కేటీఆర్ ఒక్కసారి చలించిపోయి, కన్నీరు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని కేటీఆర్ నివాళి అర్పించారు.
సాయి చంద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి వేముల, వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ బోరున విలపించారు మంత్రి వేముల. సాయిచంద్ భౌతికకాయం వద్ద అందరూ కళ్లు చెమర్చటం అక్కడివారిని మరింత బాధాహృదయుల్ని చేసింది.