Telangana tourism development : రెండు గుట్టల నడుమ నీలి ముత్యంలా మెరిసిపోతున్న జలాశయం… చుట్టూ నీరు, మధ్యలో దట్టమైన అడవితో ద్వీపాన్ని తలపించే అద్భుత దృశ్యం… తెలంగాణ పల్లెసీమలో దాగి ఉన్న ఈ ప్రకృతి సోయగం పేరు ‘రోళ్లపాడు’. కళ్లెదుట కనకపు రాశిలా పర్యాటకులను ఆకర్షిస్తున్నా, ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయింది. కాస్త దృష్టి సారిస్తే కాసుల వర్షం కురిపించే ఈ సహజసిద్ధ సౌందర్యాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అభివృద్ధికి ఉన్న అడ్డంకులేంటి? చేయాల్సిన పనులేమిటి? ఆ వివరాలపై సమగ్ర కథనం.
తెలంగాణ అంటేనే చారిత్రక కట్టడాలు, పచ్చని పల్లెలకు పుట్టినిల్లు. ఈ కోవకే చెందింది రోళ్లపాడు చెరువు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల నిర్మాణ దక్షతకు ఇది నిలువుటద్దం. అడవుల నుంచి జాలువారే నీటితో సహజసిద్ధంగా నిండుతూ, 1500 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కనువిందు చేస్తుంది.
ఘనమైన చరిత్ర… అటకెక్కిన ప్రగతి : ఈ చెరువుకు చారిత్రక ప్రాధాన్యంతో పాటు ఆధునిక చరిత్ర కూడా ఉంది. 1974లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రెండు కొండలను కలుపుతూ 18 అడుగుల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్‌గా నిర్మించారు. ఆ తర్వాత, 2016లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని 14 టీఎంసీల సామర్థ్యంతో అతిపెద్ద బ్యాలెన్స్‌డ్ రిజర్వాయర్‌గా మార్చేందుకు శంకుస్థాపన చేసినా, ‘రీడిజైన్’ పేరుతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. దీంతో అభివృద్ధి ఆశలు అడియాశలయ్యాయి.
చేయాల్సింది కొంచెమే… చేకూరేది అపారం : రోళ్లపాడును ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడానికి భారీ ప్రణాళికలు అవసరం లేదు. ప్రభుత్వం కాస్త చొరవ చూపిస్తే చాలు.
ప్రయాణ సౌకర్యం: జలాశయం మధ్యలో ఉన్న ద్వీపానికి చేరేందుకు కనీసం రెండు బోట్లను ఏర్పాటు చేయాలి.
వసతి: పర్యాటకులు సేద తీరడానికి, రాత్రి బస చేయడానికి అనువుగా రిసార్ట్స్ లేదా కాటేజీలు నిర్మించాలి.
స్థానిక ఉపాధి: రోళ్లపాడు చేపలు రుచికి పెట్టింది పేరు. ఇక్కడ ఫిషింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా స్థానిక గిరిజన సొసైటీలకు, మత్స్యకారులకు పుష్కలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
యువతను ఆకర్షిస్తున్న అందాలు : ప్రస్తుతం ఎటువంటి సౌకర్యాలు లేనప్పటికీ, రోళ్లపాడు ప్రకృతి అందాలకు యువత ముగ్ధులవుతున్నారు. ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు, ప్రత్యేక ఫొటోషూట్‌ల కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలివస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఉదయాన్నే కురిసే మంచు, లేలేత సూర్యకిరణాలు నీటిపై పడుతున్నప్పుడు ఆవిష్కృతమయ్యే దృశ్యాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు బారులు తీరుతారు.
తెలంగాణ పర్యాటకం… పరుగుపెట్టాలి : రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదాద్రి, బుద్ధవనం వంటి ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ, రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగం వాటా కేవలం 5.06 శాతంగానే ఉండటం ఆందోళన కలిగించే విషయం. రోళ్లపాడు వంటి మణిపూసలను గుర్తించి, వాటిని అభివృద్ధి పథంలో నడిపిస్తే పర్యాటక రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక విధానం ద్వారా ఈ రంగంపై దృష్టి సారించి, రోళ్లపాడు వంటి ప్రాంతాలకు మహర్దశ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


