Control room set up in secretariat: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 29 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రత తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సహాయక చర్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. జిల్లా కలెక్టర్‌తో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డిలకు హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు.
సహాయక చర్యల ముమ్మరం: ఘటనా స్థలిలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘోర ప్రమాదంపై సమన్వయం కోసం సెక్రటేరియట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాలకు అందించేందుకు, సహాయక చర్యలను అధికారులతో సమన్వయం చేసేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.
సహాయక సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
- ఏఎస్ (AS) నంబర్: 9912919545
- ఎస్‌ఓ (SO) నంబర్: 9440854433


