High-Profile Theft: సంగారెడ్డి పట్టణంలో పట్టపగలే జరిగిన భారీ దొంగతనం స్థానికులను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి కారులో వస్తున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, కేవలం నిమిషాల వ్యవధిలోనే దుండగులు రూ.20 లక్షల నగదుతో ఉడాయించారు.
హైదరాబాద్‌కు చెందిన ముజాఫీర్ అనే వ్యక్తి సంగారెడ్డిలో తాను విక్రయించిన ఇంటికి సంబంధించిన రూ.20 లక్షల నగదును రిజిస్ట్రేషన్ అనంతరం కారు (AP XXXX)లో పెట్టుకుని బయలుదేరారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆయన కారును గమనిస్తూనే దొంగలు వెంబడించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో, సంగారెడ్డిలోని క్లాసిక్ గార్డెన్ ప్రాంతంలో బంధువుల ఇంటి వద్ద ముజాఫీర్ కారు ఆపి, అత్యవసరంగా లోపలికి వెళ్లారు. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా చేసుకుని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు సినీ ఫక్కీలో కారు వెనుక అద్దాన్ని బలంగా పగలగొట్టారు. సీటు కింద లేదా డ్యాష్‌బోర్డులో ఉన్న నగదు బ్యాగ్‌ను అతివేగంగా లాక్కుని కళ్ళముందే పరారయ్యారు.
నగదు పోయిన విషయం తెలుసుకున్న బాధితుడు ముజాఫీర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచే ముఠా అనుసరించిందా? లేక ఆ ప్రాంతంలోనే రెక్కీ నిర్వహించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనం వెనుక ప్రొఫెషనల్ ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


