తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే గురుకులాల డైట్ ఛార్జీల మీద అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచలేదని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. నిత్యం అబద్దాలే ఊపిరిగా బతుకుతున్న రేవంత్.. చిన్న పిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఒక్క గురుకులాలకే కాదు.. అన్ని సాంఘిక సంక్షేమ విద్యాలయాలకు డైట్ ఛార్జీలు పెంచారని తెలిపారు. కేటీఆర్ గురుకుల బాటకు పిలుపు ఇవ్వడం వల్లే ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా హాస్టల్స్ బాట పట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మరణిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. పిల్లలు చనిపోతుంటే స్పందించని మంత్రులు.. గురుకులాలకు వెళ్లి హడావిడి చేశారని ఎద్దేవా చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నట్లు పిక్‌నిక్ డ్రామా చేశారని ఫైర్ అయ్యారు.