RS Praveen Kumar| తనపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నట్లు ఆమె ఆరోపణలు చేశారని.. వాటికి ఆధారాలుంటే సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏడేళ్ల సర్వీస్‌ను వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. గతంలో మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పిందని తెలిపారు. సురేఖకు అసలు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు.
మరోవైపు రాష్ట్రంలోని గురుకులాల్లో జరిగే ఫుడ్ పాయిజన్ ఘటనలకు ప్రవీణ్ కుమార్ కారణమని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్వేరో సభ్యులు స్పందించారు. ‘కొండా సురేఖ..కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది.. పిల్లలు ఎందుకు చనిపోతున్నారు?. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోకుండా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇంకోసారి విమర్శలు చేస్తే మీ మీద దాడి చేస్తాము’ అని హెచ్చరించారు.