ఈనెల 21 నుంచి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు అభ్యర్థులు మాత్రం గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం విచారణ చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను సోమవారం ఉదయం కోర్టు ప్రారంభంకాగానే విచారిస్తామని చీఫ్ జస్జిస్ చంద్రచూడ్ తెలిపారు. కానీ అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే మాజీ ఐఏఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) దీనిపై తనదైన శైలిలో స్పందించారు. “ఓపెన్ కాంపిటీషన్ లేదా అన్ రిజర్వుడ్ కేటగిరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్లూఎస్ లకు ప్రవేశం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా జీవో నెం.29ను తీసుకొచ్చింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీఎంను నిలదీయండి. ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్న TGPSC బోర్డును రీకాల్ చేయించండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కొంతకాలంగా గ్రూప్ పరీక్షల నిర్వహణలో గందగరగోళం నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జీవో 29 రద్దుతోపాటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మెరుపు ధర్నాకు దిగిన విషయం విధితమే. అనంతరం గురువారం సాయంత్రం గాంధీనగర్‌లోని కెనరాబ్యాంకు సమీపంలో ఉన్న జీహెచ్‌ఎంసీ ఉద్యానంలో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వారి నిరసనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.