నేరేడుచర్లలో నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ భూమిలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించి మాట్లాడారు, నేరేడుచర్లలోని నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు బిఎస్పి చివరి వరకు పోరాటం చేస్తుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం నిరుపేదలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ల పార్టీ ఆఫీసుల కోసం పదుల సంఖ్యలో ఎన్నో ఎకరాలు కేటాయించిందన్నారు. ప్రభుత్వ భూమిని నిరుపేదలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వటానికి ఎందుకు వెనకాడుతున్నారని ధ్వజమెత్తారు, నిరుపేదలు కాస్తాంత నీడ కోసం ఇళ్ల స్థలాలు అడుగుతున్నారే తప్ప, ఆ భూములను సేద్యం చేయటానికి కాదని చెప్పారు. సర్కారు భూములలో నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే జైల్లో పెడుతున్నారు కానీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి ఎవరు అనుమతలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప, ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. నిరుపేదల కోసం ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, అవసరమైతే జైలుకైనా వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ అధికార ప్రతినిధి సాంబశివ గౌడ్, జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి, జిల్లా ఇన్చార్జిలు చాడపంగ రవి, రాపోలు నవీన్ కుమార్, నేరేడుచర్ల బీఎస్పీ నాయకులు, నిరుపేద సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.