RTC Bus Accident on Warangal-Hyderabad National Higheway: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. ఒకదాని వెనుక మరో సంఘటన జరుగుతూ ప్రయాణమంటేనే భయపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా సురకిత ప్రయాణానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాలకు గురవుతుండటంతో ఆర్టీసీ భద్రతపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు మరువకముందే ఇవాళ వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేడు (శుక్రవారం) హనుమకొండ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు (TG 27 Z 0011) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్ అవుషాపూర్ వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వస్తున్న రెండు కార్లను డ్రైవర్ గమనించాడు. జరగబోయే ప్రమాదాన్ని ముందస్తుగానే పసిగట్టిన డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. అయితే రోడ్డు పక్కన నిలిపి వేసే క్రమంలో డివైడర్ పైకి ఎక్కి దిగుతుండగా బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపు బస్సు ముందు నుంచి రేసింగ్ తరహాలో రెండు కార్లు వెళ్లిపోయిన తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జనగామ డిపోకు చెందిన ఈ ఆర్టీసీ బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. ఈ బస్సు జనగామా నుంచి ఉప్పల్ వైపు వస్తుండగా ఔశాపూర్ వద్ద ఓవర్‌టేక్ ప్రయత్నం ప్రమాదానికి దారి తీసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు. సాక్షుల ఇచ్చిన సమాచారం ప్రకారం, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
38 మంది ప్రయాణికులు సురక్షితం..
ఘటన సమయంలో బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులున్నారు. బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపుకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దెబ్బతినడంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును రహదారి పక్కకు తరలించారు. ఈ ప్రమాదంపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతుండటంతో ఆర్టీసీ భద్రతా ప్రమాణాలపై ప్రయాణికులు సందేహాలను లేవనెత్తుతున్నారు. డ్రైవర్‌ల నిర్లక్ష్యం, ఓవర్‌టేక్ ప్రయత్నాలు, వేగం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. బస్సు డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని, ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్లక్ష్య చర్యలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో వాహనాల సాంకేతిక తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని రవాణా శాఖకు సూచించారు.


