TSRTC lost and found helpline : బస్సు దిగే హడావుడిలో కండక్టర్ దగ్గర చిల్లర తీసుకోవడం మర్చిపోయారా..? అయ్యో, వంద, నూట యాభై రూపాయలు పోయాయే అని మధనపడ్డారా..? ఇకపై ఆ చింతే అక్కర్లేదు..! తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ చక్కటి శుభవార్తను, సాంకేతికతతో కూడిన భరోసాను అందిస్తోంది. ఒకప్పుడు పోయాయనుకుని వదిలేసుకోవాల్సిన డబ్బులను ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్‌తో నేరుగా మీ ఫోన్‌పే, గూగుల్‌పే ఖాతాల్లోకి తిరిగి పొందవచ్చు. ఇది ఎలా సాధ్యం..? నిర్మల్‌కు చెందిన సురేశ్ అనే ప్రయాణికుడి అనుభవం మనందరికీ ఒక చక్కటి ఉదాహరణ. అసలు ఈ ప్రక్రియ ఏమిటి..? ఏం చేస్తే పోయిన డబ్బులు మన ఖాతాలో వచ్చి పడతాయి? ఆ వివరాల్లోకి వెళ్తే…
సురేశ్ ఉదంతం – ఒక నిజ జీవిత అనుభవం: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన సురేశ్, ఇటీవల హుజురాబాద్ నుంచి హనుమకొండకు భద్రాచలం డిపో బస్సులో ప్రయాణించారు. రూ. 60 టికెట్ కోసం కండక్టర్‌కు రూ. 200 నోటు ఇచ్చారు. బస్సు రద్దీగా ఉండటంతో, కండక్టర్ టికెట్ వెనుక రూ. 140 ఇవ్వాలని రాసిచ్చారు. గమ్యం రాగానే, బస్సు దిగే తొందరలో సురేశ్ ఆ డబ్బులు తీసుకోవడం మర్చిపోయారు. ఇంటికి వెళ్ళాక లెక్కలు చూసుకుంటే గానీ విషయం గుర్తుకురాలేదు. ఎక్కడో ఉన్న భద్రాచలం డిపో సిబ్బందిని సంప్రదించడం ఎలాగబ్బా అని మదనపడుతుండగా, మిత్రుడి సలహాతో ఆర్టీసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. ఆశ్చర్యకరంగా, మూడు రోజుల తర్వాత ఆయనకు రావాల్సిన రూ.140 యూపీఐ ద్వారా తన ఖాతాలో జమ అయ్యాయి.
డబ్బులు తిరిగి పొందడం ఎలా – పరిష్కారం ఇదే : ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఈ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభం. దీనికి మీ చేతిలో ఉన్న టికెట్టే మీ తాళం చెవి.
టికెట్ భద్రం: మీరు ప్రయాణించిన బస్సు టికెట్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే దానిపైనే మొత్తం సమాచారం ఉంటుంది. ఈ-టిమ్స్ యంత్రం ద్వారా జారీ చేసిన టికెట్‌పై డిపో పేరు, బస్సు సర్వీసు నంబరు, ప్రయాణించిన తేదీ, సమయం, డ్రైవర్, కండక్టర్ల సర్వీస్ నంబర్లు వంటి కీలక వివరాలు ముద్రించి ఉంటాయి.
హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి: ప్రతి టికెట్ కింద భాగంలో ఆర్టీసీ హెల్ప్‌లైన్ నంబర్ 040-69440000 స్పష్టంగా ఉంటుంది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, కండక్టర్ వద్ద డబ్బులు మర్చిపోయిన విషయాన్ని తెలపాలి.
వివరాలు అందించండి: హెల్ప్‌లైన్ సిబ్బంది అడిగినప్పుడు, మీ టికెట్‌పై ఉన్న సర్వీసు నంబరు, తేదీ, సమయం, మీరు చెల్లించిన మొత్తం, మీకు రావాల్సిన మొత్తం వంటి వివరాలను కచ్చితంగా చెప్పాలి.
నిర్ధారణ చెల్లింపు: అధికారులు మీరు చెప్పిన వివరాలను సదరు బస్సు సిబ్బందితో నిర్ధారించుకుంటారు. వాస్తవమేనని తేలిన తర్వాత, సిబ్బంది మీకు గూగుల్‌పే లేదా ఫోన్‌పే ద్వారా రావాల్సిన మొత్తాన్ని నేరుగా చెల్లిస్తారు.
డబ్బులే కాదు… వస్తువులూ భద్రమే : ఈ హెల్ప్‌లైన్ సేవ కేవలం డబ్బులకే పరిమితం కాదు. బస్సులో పొరపాటున మర్చిపోయిన బ్యాగులు, పర్సులు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు వంటి విలువైన వస్తువుల కోసం కూడా ఇదే నంబర్‌ను సంప్రదించవచ్చు. మీరు ప్రయాణించిన బస్సు వివరాలు చెబితే, వారు ఆ బస్సు సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. సాధారణంగా, బస్సు ట్రిప్ ముగించుకుని డిపోకు చేరిన తర్వాత సిబ్బంది బస్సును పూర్తిగా తనిఖీ చేస్తారు. ఆ సమయంలో దొరికిన వస్తువులను వారు భద్రపరుస్తారు. కాబట్టి, మీ వస్తువు బస్సులోనే ఉండిపోయి ఉంటే, అది మీకు తిరిగి లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి.


