RTC festival lucky draw : ఈ దసరాకు ఊరెళ్తున్నారా? ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా? అయితే మీ ప్రయాణ టికెట్‌ను పారేయకండి! అది మిమ్మల్ని వేల రూపాయలకు అధిపతిని చేయవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు దీటుగా, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. “దసరా లక్కీ డ్రా” పేరుతో ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్‌లో పాల్గొనడానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అసలు ఈ లక్కీ డ్రాలో ఎలా పాల్గొనాలి..? బహుమతులు ఏంటి..? ఎవరు అర్హులు..?
పండుగ వేళల్లో ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల వైపు వెళ్లకుండా ఆకర్షించేందుకు, రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా, ఈ దసరాకు “లక్కీ డ్రా” పథకాన్ని ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఈ ఆఫర్, అక్టోబర్ 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో ప్రయాణించే వారికి నగదు బహుమతులు గెలుచుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది.
సాధారణ రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా, పండుగ సీజన్‌లో ఈ సంఖ్య 6 లక్షలకు చేరుకుంటుంది. ఈ ప్రయాణికులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఈ లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు.
నగదు బహుమతులు ఇలా: ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు ఆర్టీసీ భారీ నగదు బహుమతులను ప్రకటించింది.
ప్రథమ బహుమతి: రూ. 25,000
ద్వితీయ బహుమతి: రూ. 15,000
తృతీయ బహుమతి: రూ. 10,000
పాల్గొనడం ఎలా? ఎవరు అర్హులు?
అర్హత: ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్-ఏసీ, ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారు మాత్రమే ఈ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హులు.
విధానం: ప్రయాణం పూర్తయిన తర్వాత, మీ టికెట్‌పై పూర్తి పేరు, ఫోన్ నంబర్, చిరునామాను స్పష్టంగా రాయాలి. అనంతరం ఆ టికెట్‌ను సంబంధిత బస్టాండ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రాప్ బాక్సులలో వేయాలి.
విజేతల ఎంపిక: ఆర్టీసీ ప్రతి రీజియన్‌కు ముగ్గురు చొప్పున, మొత్తం 11 రీజియన్‌ల నుంచి 33 మంది విజేతలను ఎంపిక చేస్తుంది. కరీంనగర్ రీజియన్‌కు సంబంధించిన డ్రాను అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు రీజినల్ కార్యాలయంలో తీసి, ముగ్గురు విజేతలను ప్రకటిస్తారు.
పండుగకు 7,754 ప్రత్యేక బస్సులు: మరోవైపు, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. గత ఏడాదితో పోలిస్తే రద్దీకి అనుగుణంగా అదనంగా 617 బస్సులను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.


