సమ్మెపై ఆర్టీసీ జేఏసీ(RTC JAC) కీలక ప్రకటన చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అనంతరం మీడియాతో జేఏసీ నేతలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నట్లు తెలిపారు. అయితే హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్‌లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతానికి బస్సులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. కాగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె సైరన్ మోగించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని యాజమాన్యం తెలిపింది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని బహిరంగ లేఖను రాసింది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపింది.