‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో సంధ్య థియేటర్(Sandhya Theatre) యాజమాన్యానికి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులకు తాజాగా థియేటర్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. ఈ మేరకు 6 పేజీల లేఖను పోలీసులకు పంపింది.
గత 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని.. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది. డిసెంబర్ 4న ‘పుష్ప-2’ ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపింది. డిసెంబరు 4, 5న థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తీసుకుందని వివరించింది. సినిమాల విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్‌కు వచ్చారంది. సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉంది చెప్పుకొచ్చింది.
కాగా డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టై జైలుకు వెళ్లొచ్చారు. ఇక బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50లక్షలు, బన్నీ రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.25లక్షలు సాయం అందించారు.