రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, అమెరికా వేదికగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగ వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం (రామగోవిందపురం) విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మకు ఉరి వేసి, దహనం చేసి నిరసన తెలిపారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేఖ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ధరణి తీసేస్తాం అన్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ తీసేస్తామని అంటున్నారు.
దేశానికి తిండి గింజలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు అధికారం మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే సబ్ స్టేషన్ లకు వెళ్లి రికార్డ్ లు చూసి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని కొంతమంది నాయకులు ప్రచారం చేస్తున్నవారి అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పంటలే లేని సమయంలో విద్యుత్ ఇవ్వడం లేదు అంటూ మాట్లాడటం వాళ్ళ అవగాహన లోపాన్ని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న ఏ రాష్ట్రం లో కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న పథకాలు లేవని తెలిపారు.