తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ తలమానికంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెనుబల్లిలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంక్షేమ ఫలాల లబ్ధిదారులతో సంక్షేమ దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ కుల వృత్తుల సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడం కొరకు ప్రవేశపెట్టిన బీసీలకు రూ లక్ష ఆర్థిక సహాయం పథకంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్ళి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను, చెక్కులతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పెళ్లికూతురులకు సొంత ఖర్చులతో చీరను బహుకరించారు. ప్రభుత్వ స్థలాల్లో కొన్నాళ్ల క్రితం ఇండ్లను నిర్మించుకున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం సంక్షేమ ఫలాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు సహపంక్తి భోజనం చేశారు.’