Sunday, September 8, 2024
HomeతెలంగాణSangareddy: అన్నదాతలు చనిపోతున్నా స్పందించరా?

Sangareddy: అన్నదాతలు చనిపోతున్నా స్పందించరా?

కాంగ్రెస్ వల్లే రైతులకు కష్టాలు

తెలంగాణ ప్రజలను మోసం చేసి మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ మొద్దునిద్ర వదిలించేందుకే దీక్షలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. అన్నదాతలు చనిపోతున్నా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం రైతులకు భరోసా ఇవ్వాలన్న సోయి కూడా సర్కారుకు లేదని చెప్పారు.

- Advertisement -

సంగారెడ్డి పట్టణంలో బీఆర్‌ఎస్‌ రైతుదీక్షలో హరీశ్‌ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వం కోల్పోయిందన్నారు. కేసీఆర్‌ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని చెప్పారు. కాంగ్రెస్‌ రాకతో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని, మోటర్లు కాలిపోతున్నాయని చెప్పారు.

కేసీఆర్‌ హయాంలో రైతులు పుట్లకొద్ది వడ్లు పండించారని హరీశ్ రావు అన్నారు. అదే కాంగ్రెస్‌ పాలనలో రైతులకు పుట్టెడు కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలు మాని రైతులకు సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ను తిట్టి ప్రజల దృష్టి మళ్లిస్తామంటే కుదరదని చెప్పారు. తమను ఎన్నయినా తిట్టండి కానీ.. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చలేదన్నారు. రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ దొందూదొందేనని ఎద్దేవాచేశారు. సాగుకు ఉరేసేలా బీజేపీ నల్లచట్టాలు చేసిందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పోరాటం చేశారని గుర్తుచేశారు. ఈ పోరాటంలో 700 మందికిపైగా అన్నదాతలు చనిపోయారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News