జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రం త్రివేణి సంగమంలో సరస్వతి నదికి పుష్కరాలు(Saraswati Pushkaralu) ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటల 44 నిముషాలకు సరస్వతి ఘాట్ వద్ద శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు చేసి పున్యస్నానం ఆచరించారు. పుష్కరాలు ఈ నెల 26వరకూ జరగనున్నాయి.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కుటుంబ సమేతంగా కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు. సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన సరస్వతి ఘాట్, భక్తుల కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు.
మరోవైపు పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక APSRTC అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా సీట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.