తెలంగాణ రాష్ట్రంలో నూతన మున్సిపాలిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మోకిలా కేంద్రంగా నూతన మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం కోరింది. ఈ మున్సిపాలిటీ లో తమ గ్రామాలను కలపాలని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పథంలో నడుస్తున్న శంకర్ పల్లికి తూర్పు వైపునున్న గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకుంటూనే మున్సిపాలిటీగా రూపాంతరం చేస్తే మరింత అభివృద్ధి చెందుతాయని అభిలషించారు. మోకిలా కేంద్రంగా నూతన మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను, ఎంపీ రంజిత్ రెడ్డిని, రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో శంకర్ పల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్ తో పాటు జన్వాడ సర్పంచ్ రవీందర్ గౌడ్, గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, కొండకల్ ఎంపిటిసి బద్దం సురేందర్ రెడ్డి ,స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.