Friday, September 20, 2024
HomeతెలంగాణSathyavathi Rathod: ప్రగతిని పల్లె పల్లెకు చాటి చెప్పాలి

Sathyavathi Rathod: ప్రగతిని పల్లె పల్లెకు చాటి చెప్పాలి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, గిరిజన, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖల్లో పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏ రోజున ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారులకు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన విద్యాలయల్లో గిరిజన సంబరాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు ఉండాలని, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి అంశాల వారీగా విశదీకరించారు.జిల్లాల వారిగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. గిరిజనుల సంస్కృతిక ఉత్సవాలు, ఆర్ట్ ఫ్రేమ్ ల ప్రదర్శన, గిరిజనుల ఉత్పత్తుల వర్క్ షాప్ లు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా కళ్యాణ లక్ష్మి, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని వివరించారు.
అంతేకాకుండా గిరిజన విద్యాలయాల్లో 12వ తేదీన పాఠశాలలో ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ జాతీయ పతాక ఆవిష్కరణ సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రెండవ రోజు తెలంగాణ పోరాటాలు తెలంగాణ ఏర్పాటు అంశాలపై సెమినార్ నిర్వహణ, హరితహారం, గిరిజన విద్యా దినోత్సవం, భద్రతా పరిశుభ్రత కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మహిళా అభివృద్ధి శిశు, సంక్షేమ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని అన్నారు. జూన్ 24 నుంచి 30 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2845 గ్రామాలు తాండాలు గూడాల పరిథిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వున్న 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా శ్రీమంతం, అన్నప్రాసన, కిశోర బాలికలకు కిట్స్ అందజేయడం , హెల్త్, న్యూట్రిషన్, హరితహారం న్యూట్రి గార్డెన్స్ ఏర్పాటు, అంగన్వాడి బాటలో భాగంగా మహిళల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా వివరించాలని సూచించారు. అధికారులు దశాబ్ది ఉత్సవాలను బాధ్యతగా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికెరీ, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, గిరిజన సంక్షేమ శాఖ, మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News