పాకాల రిజర్వాయర్ నీటిని రామప్ప చెరువు నింపి తద్వారా ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు నిర్మించి సాగునీటితో సస్యశ్యామలం చేస్తానని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కొత్తగూడ మండలంలోని ముండ్రాయి గూడెంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవంను జిల్లా కలెక్టర్ శశాంక, ఏటూరు నాగారం ఐటీడీఏ పిఓ అంకిత్, ట్రైనీ కలెక్టర్ పింకేష్ కుమార్ లతో కలిసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తూ ప్రక్కనే ఉన్న స్థలంలో శాశ్వత గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రామసభలో గత ప్రభుత్వం చేపట్టిన గ్రామ అభివృద్ధికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. 2014 సంవత్సరంకు ముందు 11 మందికి పెన్షన్లు ఉండగా ప్రస్తుతం 51 మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.2016లుగా ఇస్తున్నామన్నారు. గతంలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు లేవని, ట్రాలీలు లేవని, ట్యాంకర్లు లేవని తెలియజేశారు. నర్సరీ లేదని, డంపింగ్ యార్డ్ లేదని, వైకుంఠధామం అభివృద్ధి లేదని, పల్లెల్లో ప్రకృతి వనాలు లేవని, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. మరుగుదొడ్లను నిర్మించి పారిశుధ్యం మెరుగు పరచామన్నారు. గ్రామపంచాయతీ వర్కర్లకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చే వారిని ఇప్పుడు తొమ్మిది వేలకు పైగా వేతనంగా పొందుతున్నారన్నారు. విద్యుత్ స్తంభాలు వేయడం జరిగిందని మూడవ లైను కూడా ఇవ్వడం జరిగిందని ప్రత్యేక అధికారి వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మంత్రి కి విన్నవిస్తూ పురాతన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఇండ్లు మంజూరు చేయాలని, అదేవిధంగా వర్షాకాలంలో ఇండ్లు లోనికి నీరు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి దినోత్సవ సభలో మంత్రి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని గొప్ప ఉద్దేశంతో గురుకులాలను ప్రవేశపెట్టడం జరిగిందని, రాష్ట్రంలో ఒక వెయ్యి ఒకటి గురుకులాలను ప్రారంభించగా అందులో 509 ఆడపిల్లలకు గురుకులాలు ఉన్నట్లు తెలియజెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు 200 రూపాయలు ఉన్న పెన్షన్ను తమ ప్రభుత్వం వచ్చాక 2016 రూపాయలు పెన్షన్ గా అందిస్తున్నామన్నారు. పల్లెలు పచ్చగా ఉండాలని గొప్ప ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రము కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో సాగునీటి కొరత తీరిందన్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలను జిల్లాలో అన్ని చెరువులను నింపుతూ రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతము కూడా సస్యశ్యామలం చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులతో ప్రణాళిక రూపొందిస్తామని మూడు టీఎంసీల సామర్థ్యం గల పాకాల రిజర్వాయర్ నీటిని 200 రోజులు రామప్ప చెరువు కు తరలించి ఎత్తిపోతల పథకాలు నిర్మించడం ద్వారా రెండు పంటలకు నీరు అందించేలా కృషి చేస్తామన్నారు. పంటల సేద్యంలో రైతుల పెట్టుబడికై అప్పుల పాలు కాకుండా ఎకరానికి పది వేలు రైతుబంధు అందిస్తున్నామన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని కొని మద్దతు ధర చెల్లించడం జరిగిందని, ఇతర రాష్ట్రాలలో ఆ పరిస్థితి లేదన్నారు,ధాన్యం కొనడం లేదని రైతుబంధు ఇవ్వడంలేదని పెన్షన్లు లేవని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన బాంధవుడు అని, రైతులకు పెద్దపీట వేశారని మనసున్న మహారాజు అని మంత్రి సత్యవతి కీర్తించారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత స్థానంలో కేసీఆర్ నిలిచారన్నారు. 12 కోట్లతో నాలుగు గ్రామపంచాయతీలకు బీటీ రోడ్లు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా 9 కోట్లతో 60 సిసి రోడ్లు మంజూరు చేశామన్నారు. మూడు కోట్ల 50 లక్షలతో మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చామని, 2.30 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతామని నెల రోజులలో మొదలుపెట్టేలా మంజూరీలు ఇస్తా మన్నారు. ఈనెల 24వ తేదీ నుండి 30 తేదీ లోపు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అందులో భాగంగా జిల్లాలో ఒకరోజు నిర్వహించే కార్యక్రమంలో అర్హులైన రైతులకు 70వేల ఎకరాలకు అటవీ హక్కు పత్రాలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
పల్లె ప్రగతి దినోత్సవం లో మొదటి గ్రామంగా మోండ్రాయి గూడెం సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని , అదేవిధంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు పాల్గొని ఈ సభకు వన్నె తెచ్చారన్నారు. తన శాఖ నిధుల నుండి 10 లక్షలు అభివృద్ధికి గాను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత యువతలో విద్యతో పాటు నైపుణ్యత పెంచే శిక్షణ కార్యక్రమాలను చేపట్టి ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలను చేపట్టాలని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంకితకు మంత్రి సూచించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఈ ప్రాంత వాసులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ఒకప్పుడు త్రాగునీటి కోసం ఈ ప్రాంతం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారని తెలంగాణ రాకతో ఇబ్బందులు తొలిగాయన్నారు. ఈ గ్రామంలోని 500 జనాభాలో 240 మంది రైతులకు రైతుబంధు వస్తున్నదని అదేవిధంగా కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు వర్తిస్తున్నాయన్నారు ప్రతి గ్రామ పంచాయతీకి 10 . 50 లక్షల నిధులు విడుదల చేశామన్నారు.
అంతకుముందు మంత్రికి గిరిజనులు తమ సాంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పుష్పలత, ఎంపీపీ విజయ, సర్పంచ్ భారతి, జిల్లా పంచాయతీ అధికారి నర్మద, మండల ప్రత్యేక అధికారి సురేష్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి సురేష్, ఎంపీడీవో భారతి,తాసిల్దార్ నరేష్,శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.