మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్జానాన్ని, చారిత్రక కృషిని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని ధారపోసారని సీఎం అన్నారు. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం మహోన్నతమైనదనదని, నేటి తరానికి స్పూర్తిదాయకమని సిఎం అన్నారు.
సావిత్రీబాయి ఫూలే స్పూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, మహిళల సమాన హక్కుల కోసం కృషి చేస్తున్నదని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ దిశగా అనేక పథకాలను సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, మహిళా సాధికారతను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిఎం కేసీఆర్ తెలిపారు.