లగచర్ల (Lagacherla) ఘటనలో ఇప్పటికే 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శనివారం మరో 8 మందిని అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మందిని ముందు కొడంగల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈనెల 11న ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో అరెస్టైన వారి కుటుంబసభ్యులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ని కలిశారు.
ఈ నేపథ్యంలో అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించింది. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీ కోసం భూమి కోల్పోతున్న లగచర్ల (Lagacherla) గ్రామ ప్రజలు తమని కలిసారని చెప్పారు. భూమి కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. స్వేచ్ఛగా జీవించే హక్కు అంబేద్కర్ కల్పించారని అన్నారు. లగచర్ల గ్రామంలో కమిషన్ త్వరలో పర్యటిస్తుందని చెప్పారు. కమిషన్ ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారికి అన్యాయం జరిగితే కమిషన్ అసలు ఊరుకోదని తేల్చి చెప్పారు. అధికారుల మీద దాడులను కూడా కమిషన్ ఖండిస్తుందని వెల్లడించారు.