Saturday, November 15, 2025
HomeతెలంగాణAtrocity in Karimnagar: ఛీ ఛీ.. అసలు వీడు మనిషేనా? బాలికల బాత్రూంలో సీసీ కెమెరా.....

Atrocity in Karimnagar: ఛీ ఛీ.. అసలు వీడు మనిషేనా? బాలికల బాత్రూంలో సీసీ కెమెరా.. అటెండర్‌ అరెస్ట్..!

Secret cameras in government school bathroom: కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. పాఠశాల అటెండర్‌ బాలికల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినులు ఈ సీసీ కెమెరాలను గుర్తించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కొందరు బాలికలు సోమవారం తమ వాష్‌రూమ్‌లో అనుమానాస్పదంగా లైట్ వెలుగుతున్న ఓ పరికరాన్ని గుర్తించారు. అప్రమత్తమై అది రహస్య కెమెరా అని అనుమానించి వెంటనే తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆగ్రహంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పాఠశాల ఆవరణలో ఆందోళన తీవ్రం కావడంతో ప్రిన్సిపాల్ వెంటనే గంగాధర ఎస్సై వంశీకృష్ణ, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్‌లకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు, ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు నివేదిక పంపినట్లు ప్రిన్సిపాల్ మీడియాకు వివరించారు. బాలికల భద్రత కోసం జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ‘స్నేహిత క్లబ్స్’ వంటివి ఏర్పాటు చేశారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -

గత కొంత కాలంగా బాలికలపై లైంగిక వేధింపులు..

అయితే, బాత్రూంలో కెమెరాలు అమర్చింది అటెండర్ యాకుబ్ అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంగా యాకూబ్‌ అమ్మాయిలతో తరచూ అనవసరంగా మాట్లాడడం, వారు బాత్రూంల వైపు వెళ్తున్నప్పుడు మొబైల్​లో ఫొటోలు తీయడంతో పాటు రహస్యంగా కెమెరాలు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. యాకుబ్‌ మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసి ఆరుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లు మౌనంగా భరించిన ఓ విద్యార్థిని వారం రోజుల కిందట తన తల్లిదండ్రులు, అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో విషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు విచారణ తర్వాత యాకుబ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థుల వాంగ్మూలాలు సేకరించి, మొబైల్ ఫోన్​తో పాటు అటెండర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. కాగా, అటెండర్ యాకూబ్​ను సస్పెండ్​ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, పాఠశాల హెడ్‌మాస్టర్‌ కూడా అటెండర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు, పాఠశాల ముందు విద్యార్థి సంఘాలతో కలిసి తల్లిదండ్రులు ధర్నా చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలు సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కురిక్యాల స్కూల్​ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంను కోరారు. ఈ మేరకు వారితో ఫోన్​లో మాట్లాడారు. అటెండర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్​తో ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడి వద్ద ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకొని, విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad