సికింద్రాబాద్ సీతాఫల్మండి నోముల కన్వెంషన్ హాల్ లో నూతన భాగ్యనగర్ జర్నలిస్టుల యూనియన్ వివిధ పత్రికలు మీడియా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో యూనియన్ ఆవిర్భావం జరిగింది. భాగ్యనగర్ పరిధిలో జర్నలిస్టుల హక్కులు అభివృద్ధికై ఇప్పుడున్నటువంటి జర్నలిస్టుల యూనియన్లకు తోడుగా ఈ భాగ్యనగర్ జర్నలిస్ట్ యూనియన్ నిర్మాణం రూపుదిద్దుతుందని సీనియర్ జర్నలిస్ట్ సత్యం గౌడ్ మున్నూరు చందు నరేష్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల యూనియన్ లు అనేకం ఉన్నా, సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి జర్నలిస్టుల అభివృద్ధికి, అభ్యున్నతికి, హక్కులను, అభిప్రాయాలను, పరిగణలోకి తీసుకుని,
ప్రధానంగా మన ఈ యూనియన్ ద్వారా ఏ తేడాలు, బేదాభిప్రాయాలు, ఉత్పన్నం అవకుండా ప్రతి జర్నలిస్టును మన కుటుంబంలో సభ్యునిగా చేర్చుకుని జర్నలిస్టు వృత్తిలో ఎదురయ్యే కష్టసుఖాలు, కర్తవ్యాన్ని, క్రమశిక్షణ సంకల్పాన్ని, రానున్న రోజుల్లో పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగడమే ఈ యూనియన్ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.
ముఖ్యంగా సభ్యుడు పత్రికలో మీడియాలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విధి నిర్వహణలో టార్గెట్ అందుకోలేకపోయినప్పుడు, ఆ సంస్థ నుండి జర్నలిస్టుకు తిరిగి రావాల్సిన ఆర్థికపరమైన అంశాల పట్ల యూనియన్ అండగా నిలబడుతుంది. విధి నిర్వహణలో జర్నలిస్టు జీవితం అంధకారమైన క్రమంలో ఆర్గనైజేషన్ యాజమాన్యం, మీడియా అకాడమీ నుండి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను కల్పించేందుకు యూనియన్ కృషి చేస్తుందని, ఒక జర్నలిస్టుకు రాతల వల్ల అవతలి వ్యక్తికి, వ్యవస్థలోని ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ శక్తులకు, ఆటంకం కలిగినప్పుడు వారి నుండి ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను లీగల్ సెల్ ను సంప్రదించి ధీటుగా ఎదుర్కొంటూ పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తుందని,
జర్నలిస్టు విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థికపరమైన సమస్యలు ఎదురైన క్రమంలో సదరు విద్యాసంస్థలతో యూనియన్ ప్రతినిధులు మాట్లాడి వారి పిల్లలను సాధారణ విద్య, ఉన్నత విద్యాభ్యాసం, విద్యాభివృద్ధికి చేరుకునేందుకు యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు.
రానున్న రోజుల్లో భాగ్యనగర్ జర్నలిస్టు యూనియన్ సారథ్యంలో సికింద్రాబాద్ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను త్వరలో ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా భాగ్యనగర్ జర్నలిస్టు యూనియన్ తెలిపింది.
*త్వరలో యూనియన్ కమిటీ కార్యవర్గం యొక్క వివరాలను అందిస్తామని, యూనియన్ లో చేరడానికి ఎటువంటి నిబంధనలు, గైడ్లైన్స్ లేవని జర్నలిస్టుగా ప్రయాణం సాగిస్తున్న మీడియా, పత్రికలు, యూట్యూబ్ జర్నలిస్ట్ లు, ఇతర యూనియన్ లో కొనసాగుతున్న జర్నలిస్టులను అందరిని భాగ్యనగర్ జర్నలిస్టు యూనియన్ కుటుంబ సభ్యునిగా చేర్చుకుంటుదని, యూనియన్ నిర్మాణం ఆవశ్యకత పూర్తి సమాచారానికై మరింత లోతైన విశ్లేషణలు, మా ప్రయాణాన్ని కొనసాగించుటకు సందేహాలు, సూచనలు, అభిప్రాయాలను, ఎల్లప్పుడూ మీతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.