Aadhaar security features: ఆధార్… నేడు మన గుర్తింపునకు మూలాధారం. బ్యాంకు ఖాతా నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిదానికీ ఇదే కీలకం. అయితే, నాణేనికి రెండో వైపు ఉన్నట్లు, దీనివల్ల కొన్ని ముప్పులు కూడా పొంచి ఉన్నాయి. గతంలో ఆధార్ సమాచారం లీకై ఎందరో ఖాతాదారులు లక్షలాది రూపాయలు నష్టపోయిన ఘటనలు మన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఇలాంటి మోసాల బారిన పడకుండా మన ఆధార్ వివరాలను ఎలా కాపాడుకోవాలి? మన ప్రమేయం లేకుండా మన ఆధార్‌ను ఎవరూ దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయడం ఎలా? దీనికి భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) అందిస్తున్న వర్చువల్ ఐడీ, బయోమెట్రిక్ లాక్ వంటి రక్షణ కవచాలను ఎలా ఉపయోగించుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
ఏమిటీ వర్చువల్ ఐడీ (VID)? ఎలా పొందాలి : ఆధార్ నంబర్‌కు బదులుగా ఉపయోగించే 16 అంకెల తాత్కాలిక నంబరే వర్చువల్ ఐడీ (VID). ప్రతి పనికీ మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం లేకుండా, ఈ వర్చువల్ ఐడీని ఇవ్వొచ్చు. దీనివల్ల మీ అసలు ఆధార్ నంబర్ గోప్యంగా ఉంటుంది.
ఆన్‌లైన్ ద్వారా: ముందుగా UIDAI అధికారిక పోర్టల్ (myAadhaar)లోకి వెళ్లాలి.
‘ఆధార్ సర్వీసెస్’ విభాగంలో ‘వర్చువల్ ఐడీ (VID) జనరేటర్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘Send OTP’పై క్లిక్ చేయాలి.
మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయగానే, 16 అంకెల వర్చువల్ ఐడీ జనరేట్ అవుతుంది.
SMS ద్వారా: మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి RVID<space>ఆధార్‌లోని చివరి నాలుగు అంకెలు అని టైప్ చేసి 1947కు SMS పంపాలి. ఉదాహరణకు, మీ ఆధార్ చివరి నాలుగు అంకెలు 5678 అయితే, RVID 5678 అని పంపాలి. వెంటనే మీ వర్చువల్ ఐడీ SMS రూపంలో వస్తుంది.
ఆధార్ బయోమెట్రిక్‌కు తాళం వేయండిలా : మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను లాక్ చేయడం ద్వారా వాటిని ఎవరూ దుర్వినియోగం చేయకుండా నిరోధించవచ్చు. MyAadhaar పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ‘ఆధార్ సర్వీసెస్’ ట్యాబ్‌లో ‘ఆధార్ లాక్/అన్‌లాక్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాతి పేజీలో సూచనలను అనుసరించి, మీ వర్చువల్ ఐడీ, పూర్తి పేరు, పిన్‌కోడ్, క్యాప్చా వివరాలను నమోదు చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ అవుతాయి. మీకు అవసరమైనప్పుడు ఇదే పద్ధతిలో అన్‌లాక్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ లాక్‌లో ఉన్నప్పుడు, మీరు వేలిముద్ర ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపలేరు.
మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండి : గత ఆరు నెలల్లో మీ ఆధార్‌ను ఎక్కడెక్కడ, ఏయే ధ్రువీకరణ కోసం ఉపయోగించారో సులభంగా తెలుసుకోవచ్చు.
MyAadhaar పోర్టల్‌లో మీ ఆధార్ నంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వండి. ‘Authentication History’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఏ రకమైన ధ్రువీకరణ (బయోమెట్రిక్, ఓటీపీ, డెమోగ్రాఫిక్) తెలుసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి. తేదీలను ఎంచుకుని ‘Fetch Authentication History’ పై క్లిక్ చేస్తే, మీ ఆధార్ వినియోగ చరిత్ర మొత్తం కనిపిస్తుంది. అందులో మీకు తెలియని లావాదేవీ ఏదైనా కనిపిస్తే, వెంటనే అప్రమత్తం కావాలి.
ఫిర్యాదు చేయడం ఎలా : మీ ఆధార్ దుర్వినియోగం అయినట్లు అనుమానం వస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా UIDAI టోల్-ఫ్రీ నంబర్ 1947కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా [email protected]కు ఈ-మెయిల్ పంపడం ద్వారా గానీ, UIDAI వెబ్‌సైట్‌లో నేరుగా గానీ మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
వేలిముద్రలు సరిగా పడకపోతే : వృద్ధాప్యం, శారీరక శ్రమ వంటి కారణాల వల్ల కొందరి వేలిముద్రలు అరిగిపోతుంటాయి. అలాంటి వారు ఆధార్ కేంద్రానికి వెళ్లి ‘బయోమెట్రిక్ మినహాయింపు’ కింద తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అధికారులు మీ వేలిముద్రలను పరిశీలించి సమస్యకు తగిన పరిష్కారం చూపుతారు.


