ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా మల్లన్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇటీవల బీసీ గర్జన సభలో రెడ్డి కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలతో పాటు ఇతర పార్టీల రెడ్డి నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉండగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వే నివేదిక పేపర్లను తన ఛానల్ లైవ్‌లో తగలబెట్టడం సంచలనంగా మారింది. ఈ సర్వేలో తప్పుడు లెక్కలు చూపించారని.. బీసీలను కావాలనే తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు. దీంతో మల్లన్న వ్యవహారంపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈమేరకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
తాజాగా మల్లన్న వ్యవహారంపై మంత్రి సీతక్క(Seethakka) స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న గెలుపు కోసం తాము చాలా కష్టపడ్డామని.. కానీ ఇప్పుడు ఆయన వ్యవహారం చూస్తుంటే కష్టపడినందుకు బాధగా ఉందని తెలిపారు. అసలు మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా? అనేది డిసైడ్ చేసుకోవాలని సూచించారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలని స్పష్టం చేశారు.
అలాగే బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడానికి బీసీ సమాజానికి ఇదే సరైన సమయమన్నారు. కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు ఆ అంశంపై మాట్లాడే హక్కు కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం, పార్టీ అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారన్నారు. ఇక ఆలే నరేంద్ర నుంచి ఈటల రాజేంద్ర వరకు బీసీ నేతలను అవమానించి పార్టీ నుంచి బయటకు పంపించలేదా అంటూ ఆమె మండిపడ్డారు. ఇలాంటి పార్టీ నేతలు కూడా బీసీల మీద మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.