గత మూడు రోజులుగా ములుగు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని, ముంపు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉందని, 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ పిల్లలను వాగులు వంకలు చెరువుల వద్దకు వెళ్ళని సూచించారు. గ్రామాలలో విద్యుత్తు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సీతక్క తెలిపారు. విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, తడి చేతులతో విద్యుత్తు పరికరాలు ముట్టుకోవద్దని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇంటి పరిసర ప్రాంతాలలో ఇనుప తీగలపై బట్టలు ఆరేసే క్రమంలో విద్యుత్ తీగలు తాకకుండా చూసుకోవాలని, విద్యుత్ ప్రవహిస్తున్న వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోవాలని అన్నారు. రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్ళవద్దని, స్టార్టర్లు కలవకుండా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు వంగిన వైర్లు తెగిన పక్షంలో వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని వారు కోరారు.