ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, మేడారం జాతరకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ఈ నెల 7, 8వ తేదీలలో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు మాజీ ఎంపీ సీతారాం నాయక్ వెల్లడించారు. ప్రధాని మోడీ ఆ రెండింటిని ప్రకటిస్తేనే ఆయన రాష్ట్ర పర్యటనకు సార్ధకత ఉంటుందని మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీర సీతారాం నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను బిజెపి ఎంపీలు దెబ్బతీస్తున్నారని, 2019 సంవత్సరంలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా యూనివర్సిటీ ఏర్పాటు కోసం కావలసిన 336 ఎకరాల భూమి అప్పగించామన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తేనే ఉంటామని, గిరిజనుల కోసం చట్టసభలలో ఆమోదం పొందిన కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు నోచుకోకపోవడం దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియా ఖండంలోనే కుంభమేళా జాతరగా పేరొందిన మేడారం జాతరకు నేటి వరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించలేదని, ఈనెల 8వ తేదీ లోగా ప్రధాని మోడీ మేడారం కు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేసిన పక్షంలో నిరాహార దీక్ష ఉపసంహరించుకుంటామని అన్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో ప్రజలు ప్రజాసంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ కుమార్, గై అశోక్, భూక్య మురళి, పో రిక విజయ రామ్ నాయక్, లింగాల రమణారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు మోతే రాజు, విష్ణువర్ధన్, సాగర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.