రెండు సంవత్సరాల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో(Apsara Murder Case) రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రేమ పేరుతో యువతిని వలలో వేసుకున్న పూజారి సాయికృష్ణ (36) పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు అప్సరను అతి కిరాతంగా హతమార్చాడు. కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా 10 లక్షల రూపాయలని అప్సర కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది.
కాగా పోలీసుల విచారణలో పెళ్లి చేసుకోవాల్సిందిగా అప్సర వేధింపులు భరించలేకనే హత్య చేసినట్లు సాయి తెలిపాడు. పెళ్లి చేసుకోకపోతే తన పరువును బజారుకు ఈడుస్తానని బెదిరించినట్లు చెప్పాడు. ఈ విషయం బయటకొస్తే తన ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో అప్సరను హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. పథకం ప్రకారమే అప్సరను హత్య చేసి పూడ్చేసినట్లు కస్టడీలో పోలీసులకు వివరించాడు.