తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మహిళ(Meerpet Murder Case) హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. పోలీసులు గట్టిగా విచారణ జరుపుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గురుమూర్తి ఒక్కడే ఈ హత్య చేసినట్లు భావిస్తుండగా.. తాజాగా మరో ముగ్గురి హస్తం ఉన్నట్లు సమాచారం. విచారణలో భాగంగా ఈ హత్యకు మరో ముగ్గురు సహకరించారని గురుమూర్తి పోలీసులకు చెప్పాడు. దీంతో ముగ్గురి ఆచూకీ కోసం వెతకగా.. వారు పరారీలో ఉన్నారు.. ఆ ముగ్గురిలో ఒకరు గురుమూర్తి తల్లి కాగా మరొకరు ప్రియురాలిగా గుర్తించారు. ఇక మూడో వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న గురుమూర్తి నుంచి ఈ హత్యకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
కాగా ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న గురుమూర్తి.. జనవరి 15న తన భార్యను కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం హెక్సా బ్లెడుతో తల, మొండెం వేరు చేసి, శరీరాన్ని మూడు భాగాలుగా కోశాడు. అనంతరం మాంసాన్ని బకెట్‌లో వేసి హీటర్‌తో మరిగించాడు. తర్వాత ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్, ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న చిన్న ముద్దలయ్యేలా చేశాడు. ఎముకలను స్టవ్‌పై కాల్చి చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి పొడిలా మార్చాడు. ఈ పొడిని మీర్‌పేట పెద్ద చెరువులో పారేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన విషయం విధితమే.