రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. రహదారుల పైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు విభాగాలు మరింత అప్రమత్తమయ్యాయి. కాగా భారీ వర్షాల నేపథ్యంలో శేరీలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి జోన్ పరిధిలోని లింగంపల్లి ఆర్ యు బి, మై హోమ్ మంగళ ఆర్ యు బి, నెక్తార్ గార్డెన్, గచ్చిబౌలి, ఖాజా గూడా, సహా పలు ప్రాంతాలలో పర్యటించి వరద నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ జోన్ వ్యాప్తంగా 15 మాన్ సూన్ బృందాలు వరద నివారణ సహాయక చర్యలలో పాల్గొంటున్నాయని తెలిపారు. కాలనీలు ముంపుకు గురికాకుండా యుద్ద ప్రాతిపదికన బృందాలు తగు నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఆయా విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు.
ట్రాఫిక్ కు ఏమాత్రం అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సర్కిల్ స్థాయిలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగం, అధికారులు అనుక్షణం క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరారు. నాళాలు గ్రైండ్ల వద్ద ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన జాగ్రత్త చర్యలను చేపట్టాలని జోనల్ కమిషనర్ పేర్కొన్నారు. లింగంపల్లి ఆర్ యు బి సహా ఇతర సమస్యాత్మక ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన వరద ముంపు నివారణ చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
జోనల్ కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ లు ముకుందా రెడ్డి, మోహన్ రెడ్డి, ఎస్ ఇ శంకర్ సహా పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.