“గ్రామాలలో సచ్చిన మనుషులను, కుక్కలను, పశువులను కూడా తీసేస్తిమి, మోరీలను శుభ్రం చేస్తిమి.. అన్ని పనులు కష్టం అనకుండా చేసినం.. అందరి కష్టాలు తీరుస్తున్నారు.. జర మాపై కూడా ప్రభుత్వం కనికరం చూపేలా చూడండి సారూ”.. అంటూ పారిశుధ్య కార్మికులు తమ ఇబ్బందులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేను క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ సమస్యలను ఆయనకు వివరించారు. సంవత్సరాల తరబడి గ్రామపంచాయతీ కార్మికులుగా తాము పనిచేస్తున్నామని ఇస్తున్న పారితోషకం 9,500 కూడా ఇద్దరికీ ముగ్గురుకి ఇస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇప్పటికే అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతాలు పెంచామని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలు కూడా ఆలోచించి మంచి శుభవార్త చెప్తుందని ఆయన అన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని, సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్మికులు ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామపంచాయతీ కార్మిక నాయకులు జంగయ్య, యాదయ్య, మల్లేష్, నర్సింలు, భాగ్యమ్మ, కమలమ్మ, కృష్ణయ్య, నరసింహులు, పద్మమ్మ, కిష్టయ్య, చంద్రమ్మ, ప్రమీల, బుచ్చమ్మ, యాదమ్మ, పార్వతమ్మ, మైసమ్మ, మాణిక్యం, శ్యామల, సురేష్, పద్మమ్మ, దేవమ్మ, దేవజ నాయక్, మోహన్, రవి పాల్గొన్నారు.