షాద్ నగర్ నియోజకవర్గంలో దళితుల ఓట్లు 45 వేలకు పైబడి ఉంటే అందులో దళిత బంధు పథకం ఎంతమంది దళితులకు ఇచ్చావో ఎమ్మెల్యే అంజన్న సమాధానం చెప్పి దళితుల ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ షాద్ నగర్ నియోజకవర్గం కన్వీనర్ ఎర్రోళ్ల జగన్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు భాస్కర్ ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన ఎర్రోళ్ల జగన్ మాట్లాడుతూ షాద్ నగర్ నియోజకవర్గంలో ఒక్కరికి లేక ఇద్దరికీ ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు పథకం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. దళిత బంధు ఆశతో దళితులంతా మనసు చంపుకొని బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. మనసు కాంగ్రెస్ పార్టీలో మనిషి మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ప్రయాణం చేస్తున్నారని అన్నారు. దళితులకు, దళిత క్రిస్టియన్లకు హైదరాబాద్ నడి ఒడ్డున బంజారాహిల్స్ లో దళిత గిరిజన క్రిస్టియన్ దళిత భవనం కట్టిస్తానని చెప్పిన మాటలు మర్చిపోయి కొత్తగా షాద్నగర్లో కేటీఆర్ నోటితో మరో కొత్త నాటకం వేశారని ఆయన భగ్గుమన్నారు. కేశంపేట్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు భాస్కర్, జూపల్లి అనసూయమ్మ, బలరాం, కిష్టయ్య, కృష్ణ, చంద్రయ్య, కిష్టయ్య, కొత్తపేట కృష్ణ, బిక్షపతి, కొత్తపేట సాయిలు, గోని జంగయ్య, అర్జున్, రామచంద్రయ్య, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.