SHG Women: ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు, అల్లికలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచిన గ్రామీణ మహిళలు నేడు వ్యాపార వేత్తలుగా రాణిస్తున్నారు. దేశ అభ్యున్నతికి చోదక శక్తిగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలోని మహిళలను సాధికారతవైపు నడిపించాలని, వ్యాపారవేత్తలుగా మార్చాలనే ధృడసంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇందిరా మహిళా శక్తి పాలసీ. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయలనే ధృడసంకల్పంతో ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం మంచి సత్పలితాలనిస్తుంది. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యలో మెుత్తం 8,196 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో 91,369 మంది సభ్యులు ఉన్నారు. ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా జిల్లాలోని మహిళా సంఘం సభ్యులంతా కలిసి నారాయణపేట జిల్లా సింగారం X రోడ్డులో రూ 1.30 కోట్ల వ్యయంతో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. దీనిని 2025 ఫిబ్రవరి 21 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ బంక్ నిర్వహణ కోసం 20 ఏళ్ళ కు నెలకు రూ.10 వేల అద్దె ప్రాతిపదికన బీ.పీ.సీ.ఎల్‌తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది.
పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం ప్రభుత్వం 11 మంది మహిళలకు ముందస్తుగా జడ్చర్ల, షాద్ నగర్ లలోని పెట్రోల్ బంక్ లలో మేనేజర్, సేల్స్ వుమన్ లుగా తగు శిక్షణను ప్రభుత్వం ఇప్పించింది. మౌలిక వసతులు కల్పనకు రూ. 15 లక్షలు సంఘం తరపున ఖర్చు చేశారు. మహిళా సమాఖ్య పెట్రోల్‌బంక్‌లో రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, 6 వేల లీటర్ల డీజిల్ విక్రయం జరుగుతుంది. అందులో బంక్ నిర్వహిస్తున్న 10 మంది సేల్స్ మహిళలకు ఒక్కొక్కరికి నెలకు రూ.13,200 చొప్పున, మహిళా మేనేజర్‌కు నెలకు రూ 18,000 లు వేతనంగా జిల్లా సమాఖ్య నుండి చెల్లిస్తున్నారు. మహిళా పెట్రోల్ బంక్ ద్వారా వేతనాలు , ఇతర నిర్వహణ ఖర్చులు పోను 6 నెలలలో రూ 15.50 లక్షల ఆదాయాన్ని ఆర్జించినట్లు పెట్రోల్ బంక్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రకళ అనే మహిళ తెలిపారు. అంటే ప్రతినెల సరాసరిన రూ.2.50లక్షల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ప్రభుత్వం సైతం మహిళలు నిర్వహిస్తున్న ఈ బంక్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ప్రతి 15రోజులకోకసారి పెట్రోల్ బంక్ నిర్వహణపై సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అందుకు అనుగుణంగా జిల్లా పాలనాధికారి సైతం ఆవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు రైతుకూలీలుగా, మిషన్ కుట్లు, దినసరి కార్మికులుగా పనిచేసే మహిళలు నేడు వ్యాపార వేత్తలుగా ఎదిగారు. ఈ విజయంలో ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ మహిళల పట్టుదల సైతం మరవలేనిది. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదొక ముందడుగుగా పేర్కొనవచ్చు. ఈ పెట్రోల్‌బంక్ తెలంగాణలోనే కాదు.. దేశం మొత్తంలో జిల్లా మహిళా సమాఖ్యచే నడిచే మొదటి పెట్రోల్ బంక్‌గా గుర్తింపు పొందింది.


