NEW DGP Shivadhar Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా బత్తుల శివధర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత డీజీపీ జితేందర్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయన స్థానంలో శివధర్‌రెడ్డిని ఎంపిక చేసింది. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన శివధర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నియామక ఉత్తర్వులను ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. సెప్టెంబర్ 30 తర్వాత శివధర్‌రెడ్డి తెలంగాణ డీజీపీగా పూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన అత్యున్నత పదవిలో ఆయన నియామకంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ: రాష్ట్రంలో నూతన డీజీపీ ఏర్పాటుతోపాటుగా భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌లను రేవంత్ సర్కార్ బదిలీ చేసింది.ఆరుగురు ఐఏఎస్ మరియు 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా కీలక స్థానాల్లో అధికారుల మార్పులు జరగడంతో ఈ బదిలీలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రధాన నియామకాలు: తెలంగాణ డీజీపీగా ఇప్పటికే బత్తుల శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన ఇంతకుముందు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. ఆర్టీసీ ఎండీగా పనిచేసిన వీసీ సజ్జనార్ ఇకపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ)గా బాధ్యతలు స్వీకరించనున్నారు.హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా నియమించారు. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని నియమించారు. ఇంటలిజెన్స్ డీజీగా విజయ్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖా గోయల్‌ను నియమించారు. ఫైర్ వింగ్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ చీఫ్‌గా వీవీ శ్రీనివాసరావు, మరియు పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు చారుసిన్హాకు అప్పగించారు.
వివాదాస్పద కలెక్టర్ బదిలీ: రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేసిన సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ అధికారిని తప్పించింది. చట్టవిరుద్ధమైన చర్యలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘన వంటి అంశాల కారణంగా ఆయన గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన స్థానంలో హరితను సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు. సందీపకుమార్ ఝాకు స్పెషల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పాలనాపరమైన, పోలీసు వ్యవస్థలో పెద్దఎత్తున మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బదిలీల ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.


