గచ్చిబౌలి (Gachibowli) బిల్డింగ్ పక్కకి ఒరిగిన ఘటనలో విస్టుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్దిఖ్ నగర్ బస్తీలో ఓ యజమాని నిబంధనలకు విరుద్ధంగా 60 గజాల స్థలంలో G+4 తో పాటు పైన పెంట్ హౌస్ కూడా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇంటి యజమాని కనీస నిర్మాణ ప్రమాణాలను కూడా పాటించలేదని తెలుస్తోంది. రెండు సంవత్సరాల క్రితమే ఈ భవనాన్ని నిర్మించారు. అయితే ఈ భవనానికి ఎలాంటి సెట్ బాక్ లేకుండా నిర్మించారు. ఇలా నిర్మించిన భవనాల్లో నివాసం ప్రమాదకరం అని అధికారులు చెబుతున్నారు.
తాజాగా, ఈ ఐదంతుస్థుల భవనానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా పిల్లర్ల ఫిట్టింగ్ కోసం 12 అడుగుల లోతులో మట్టిని త్వవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రమాదానికి గురైన బిల్డింగ్ పిల్లర్ డ్యామేజ్ అయింది. దీంతో భవనం ఎడమవైపుకు ఒరిగింది. భవనం ఏ క్షణంలోనైనా కూలే ప్రమాదం ఉందని భావించిన అధికారులు స్థానిక నివాసితుల్ని ఖాళీ చేయించారు. హైడ్రాలిక్ యంత్రంతో భవనాన్ని కూల్చివేసేందుకు జీ హెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్ అధికారులు చర్యలు చేపట్టారు.