రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిన్న కిడ్నాప్ కు గురైన యువతిని పోలీసులు 6 గంటల్లో కనుగొని.. వైశాలిని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. వైశాలితో తనకు ముందే పెళ్లైందని, ఆమె తన భార్య అని, విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అయిందని ఆరోపిస్తూ నవీన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్‌రెడ్డి సైన్యంలో పనిచేసి కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మన్నెగూడలో కుటుంబంతో స్థిరపడ్డారు. కుమార్తె వైశాలి (24) నగరంలో బీడీఎస్ చదువుతోంది. బొంగుళూరులోని ఓ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ఆమెకు హస్తినాపురం నివాసి మిస్టర్ టీ కంపెనీ ఎండీ, నల్గొండజిల్లా ముషంపల్లికి చెందిన కె.నవీన్‌రెడ్డి (29)తో 2021లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. విషయం ఇరు కుటుంబాలకు చెప్పగా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలతో పెళ్లిని రద్దుచేసుకున్నారు. ఈ క్రమంలో నవీన్ నుండి వైశాలికి వేధింపులు పెరిగాయి.
దాంతో వైశాలి తల్లిదండ్రులు ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి నిన్న నిశ్చితార్థం రోజున వైశాలిని కిడ్నాప్ చేశాడు. అడ్డొచ్చిన తల్లిదండ్రులు, బంధువులపై దాడి చేశాడు. ఆ తర్వాత పోలీసులకు వైశాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. ఆమె కోసం గాలించి 6 గంటల్లో ఆచూకీ కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. వైశాలి-నవీన్ లు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారని నవీన్ తల్లి మీడియాకు తెలిపింది. ఆమెను పెళ్లి చేసుకున్నానని తన కొడుకు చెప్పాడని, తను మాత్రం ఆ పెళ్లి చూడలేదని పేర్కొన్నారు. ఇద్దరూ భార్యాభర్తలుగానే తిరిగారని, గతంలో చాలాసార్లు ఆమెను ఇంటికి తీసుకొచ్చాడని తెలిపారు.
వీరి ప్రేమకు మొదట ఒప్పుకున్న యువతి తల్లిదండ్రులు.. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారన్నారు. వైశాలికి ఫారెన్ సంబంధం చూస్తున్నారని తన కొడుకు అన్నాడని తెలిపింది. యువతికి నవీన్ అంటే ఇష్టమున్నా.. అతడిని పెళ్లాడితే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి బలవంతంగా మరో పెళ్లికి ఒప్పించారన్నారు. యువతిపై తమకెలాంటి కోపంలేదని, ఇష్టంతో వస్తే ఆమెను కోడలిగా ఆదరిస్తానని ఆమె స్పష్టంచేశారు.