సెలబ్రెటీలపై బెట్టింగ్ యాప్స్(Betting Apps) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Shyamala) తెలంగాణ హైకోర్టు(TG High Court)ను ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశముంది. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న వాళ్లలో హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషాయనీ సుప్రీత ఉన్నారు. ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలు పోలీసులు ఎదుట హాజరయ్యారు. వారిని పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించి కీలక విషయాలు రాబట్టారు. తాము డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిట్లు విచారణలో ఒప్పుకున్నారు.