Sunday, October 6, 2024
Homeతెలంగాణకార్మిక శక్తికి అండగా కేసీఆర్ ప్రభుత్వం

కార్మిక శక్తికి అండగా కేసీఆర్ ప్రభుత్వం

సిఎం కేసీఆర్ తోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణ

గత ప్రభుత్వాల హయాంలో సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగ హక్కు కోల్పోయారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ వారసత్వపు ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించి కార్మిక లోకానికి దేవుడయ్యారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆర్జీ-2 పరిధి, వకీల్ పల్లె బొగ్గు గనిపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో దశాబ్ది ప్రగతి యాత్ర జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వారసత్వ ఉద్యోగ హక్కును పోగొట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష 20 వేలు గా ఉన్న కార్మికులను 60 వేలకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం వారసత్వపు ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించి సింగరేణి కార్మికుల ఉనికిని రక్షించారని ఆయన అన్నారు. దీంతో సుమారుగా 16వేల మంది యువత సింగరేణిలో ఉద్యోగులుగా చేరారని అన్నారు. వారసత్వంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెళ్లివిరిసిందన్నారు.

- Advertisement -

టీబీజీకేఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కార్మిక హక్కులను ఎన్నో సాధించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెప్పించి, ఒప్పించి రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశానన్నారు. ఈ కళాశాలతో స్థానిక నిరుపేద ప్రజానీకానికి ఉచితంగా కార్పొరేట్ వైద్యంతో పాటు మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ కళాశాల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారుగా వెయ్యి కుటుంబాలకు జీవనోపాధి లభించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం.. ప్రతి ముఖంలో ఆనందం సీఎం కేసీఆర్ తో సాధ్యమైందన్నారు. సిఎం కేసీఆర్ పాలనతో సంతృప్తి చెందిన పలువురు కార్మికులు ఎమ్మెల్యే సమక్షంలో టి.బి.జి.కే.ఎస్ సంఘంలో చేరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ఐలి శ్రీనివాస్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, మల్లికార్జున్, చంద్రయ్య, రాములు, దశరథం, బాబురావు, సమ్మయ్య , రాకేష్, రామచంద్రారెడ్డితో పాటు కార్పొరేటర్లు సాగంటి శంకర్, అడ్డాల గట్టయ్య, బిఆర్ఎస్ నాయకులు మేడి సదానందం, ధరణి జలపతి, జనగామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News