సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవలంబిస్తున్న పర్యావరణహిత మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి చర్యలకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు ఈ అవార్డును ప్రదానం చేశారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ లో అవలంబిస్తున్న కాలుష్య నివారణ చర్యలు, నీటి, ఇంధన పొదుపు చర్యలు, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపునకు చేస్తున్న అసాధారణ కృషిని గుర్తిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అవార్డును ప్రదానం చేశారు.
సంస్థ తరఫున చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథ రాజు ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత వస్తువుల ప్రదర్శనను మంత్రులు ఆద్యంతం తిలకించారు. అనంతరం కాలుష్య, ప్లాస్టిక్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న వివిధ శాఖల అధికారులు, సంస్థలు, విద్యార్థులకు ప్రోత్సహకాలను, బహుమతులను అందజేశారు. సింగరేణి కాలరీస్ అధునాతన సాంకేతిక పద్ధతులను అనుసరిస్తూ పర్యావరణహిత మైనింగ్ పద్ధతులకు మొదటి నుంచి పెద్దపీట వేస్తోంది. ఓవర్ బర్డెన్ డంప్‌లపై పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది. హరిత హారంలో భాగంగా ఇప్పటికే 5.71 కోట్ల మొక్కలు నాటింది. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా కంపెనీ ఇంధన అవసరాలను సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా తీర్చుకోవాలన్న ఉద్దేశంతో భారీ ఎత్తున సోలార్ ప్లాంట్లను నెలకొల్పుతూ ముందుకు వెళ్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రంలోనూ కొత్త పర్యావరణహిత నియమావళికి అనుగుణంగా ఫ్లు గ్యాస్ డీసల్ఫరైజేషన్ లాంటి కొత్త ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తూ పర్యావరణ హితంగా థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది.